రోడ్డుపై ప్రమాదకరంగా గుంత..
అనంతపురం, కార్పొరేషన్ మేజర్ న్యూస్:అనంతపురం నగరంలోని రెండవ రోడ్డు బ్రిడ్జి కింద సి.ఎస్.ఐ. ఎయిడెడ్ న్యూ టౌన్ స్కూల్ సమీపంలో తవ్విన గుంతను అలాగే వదిలేయడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది. ఏదో పనుల నిమిత్తం గుంత తవ్విన సంబంధిత సిబ్బంది, పనులు పూర్తిచేయకుండా కనీస రక్షణ చర్యలు కూడా చేపట్టకుండా వదిలేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులు సైతం ఇదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు, రక్షణ కవచాలు లేకుండా గుంత ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు,
వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, విద్యార్థులు, ప్రజలు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే గుంతను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.