జనవరి 25 నుంచి రెండోదశ జనగణన.... * ఖచ్చితమైన వివరాలను నమోదు చేయాలి *
విజయనగరం, సూర్య : కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 16వ జన గణన-2027 ప్రక్రియ రెండోదశను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిగా సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. చింతలవలసలోని ఎం.వి.జి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా, ఛార్జ్ లెవెల్ అధికారులకు జరుగుతున్న రెండోదశ జనగణన శిక్షణా కార్యక్రమంలో రెండో రోజు మంగళవారం కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణ తీరును కలెక్టర్ పరిశీలించి, అధికారుల అవగాహనా స్థాయిని పరీక్షించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ మూడు రోజుల శిక్షణను అధికారులు సద్వినియోగం చేసుకొని డేటా సేకరణపై పూర్తి స్పష్టత, అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి తప్పిదాలు, సమన్వయ లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఒక్కో గణాధికారి తమకిచ్చిన 40 రోజుల గడువులో సుమారుగా 800 మంది వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 7 ఇళ్లనుంచి వివరాలను సేకరించాల్సి ఉంటుందని, మొదట్లో కొంచెం ఆలస్యమైనా, రానురానూ వేగం పుంజుకుంటుందని చెప్పారు. అడగాల్సిన 40 ప్రశ్నలపై ముందుగా ఎన్యూమరేటర్లు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాలని, కుటుంబంలోని ప్రతీఒక్కరికీ ఆ 40 ప్రశ్నలను అడిగి, వివరాలను సేకరించాలని సూచించారు. జన గణనలో సేకరించిన కులం వివరాలను, ఎట్టిపరిస్థితిలోనూ కుల ధృవీకరణ పత్రం మంజూరులో పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, జనగణన జాయింట్ డైరెక్టర్, సి.పి.ఓ. బాలాజీ, డిపిఓ డివి మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎఎస్ఓలు, డిటిలు తదితరులు పాల్గొన్నారు.