గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం
సూర్య కరీంనగర్ ;; బీసీల హక్కుల సాధన కోసం గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.కరీంనగర్‌లోని తారక హోటల్‌లో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమాన్లు మాట్లాడారు.బీసీ ఉద్యమం పట్టణాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి విస్తరించాలని, గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు సంఘ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత జాతీయ జనగణనలో ఓబీసీ కాలమ్ చేర్చి సమగ్ర కులగణన చేపట్టాలని, ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి జనాభా ప్రాతిపదికన బీసీలకు తగిన వాటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయమైన ప్రాతినిధ్యం దక్కే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీల మహాసభ నిర్వహించి హక్కుల సాధన కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు ఎన్నం ప్రకాష్, రంగు సంపత్ గౌడ్, పరుశరాములు, రాచమల్ల రాజు, దొగ్గిలి శ్రీధర్, నారోజు రాకేష్ చారి, సంజీవు, ఐల్ల ప్రసన్న, సంతోషిని, సురేందర్ బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.