ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో గ్రామసభలు
కౌడిపల్లి;ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో మండల పరిధిలోని కంచన్పల్లి, బూరుగడ్డ గ్రామ పంచాయతీ లలో గ్రామసభలు నిర్వహించి రైతులకు వాతావరణ పరిస్థితులు, రానున్న వర్షాకాలం, భూగర్భ జలమట్టం తగ్గుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు మరియు నీటి సంరక్షణపై అవగాహన వ్యవసాయ అధికారులు కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏవో సాహితి మాట్లాడుతూ ప్రస్తుతం భూగర్భ జలమట్టం పరిస్థితులను వివరించి, రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న వంటి పంటలు, పెసర, మినుము, అలసంద వంటి పప్పుధాన్య పంటలు, పొద్దుతిరుగుడు మరియు వేరుశనగ వంటి నూనెగింజల పంటలను సాగు చేయాలని సూచించారు. అలాగే అనుకూలమైన భూములు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ, రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందే అవకాశాలను పరిశీలించాలని వివరించారు.వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు రుతుపవనాల రాక, వర్షాల పరిస్థితులు, విత్తనాలు వేసేందుకు అనువైన సమయం గురించి వివరించారు. ఉద్యానవన శాఖ అధికారి మహేశ్వరి మాట్లాడుతూ నీటి లభ్యతను బట్టి ఆకుకూరలు, బెండ, గోరుచిక్కుడు వంటి కూరగాయలను సాగు చేయాలని, డ్రిప్ సౌకర్యం ఉన్న రైతులు టమాటా, మిరప, బీరకాయ, కాకరకాయ, సొరకాయ వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు.డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు అందించే రాయితీలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, చిన్న మరియు సన్నకారు రైతులకు, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం ఎంపిడిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ వి బి జి రామ్ పథకం ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలకు చేపట్టే పనులను వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు, గ్రామ స్థాయిలో కమ్యూనిటీ సోక్ పిట్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయాలని సూచించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో ఫార్మ్ పాండ్స నీర్మించుకొని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా అవసరమైన సమయంలో పంటలకు వినియోగించుకోవచ్చని వివరించారు. నీటి సంరక్షణకు ప్రతి రైతు, గ్రామ ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.మిషన్ భగీరథ ఎఈ మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నీటి కనెక్షన్ వద్ద ఆన్–ఆఫ్ ట్యాప్ వాల్వ్‌ను ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వినియోగించి ట్యాప్‌ను వెంటనే మూసివేయడం ద్వారా నీటి వృథాను నివారించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, ఏపీఓ, ఏఈవో సాహితి, మిషన్ భగీరథ ఏఈ, ఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, గ్రామ సర్పంచులు మరియు రైతులు పాల్గొన్నారు.రైతులు వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు పద్ధతులు పాటిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని అధికారులు సూచించారు.