దివ్యాంగ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే క్రీడా పోటీలు : ఎంఈఓ భాగ్యమణి
శామీర్‌పేట, మేజర్ న్యూస్:దివ్యాంగ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించినట్లు మూడు చింతలపల్లి మండల విద్యాధికారి భాగ్యమణి తెలిపారు. శనివారం మూడు చింతలపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ క్రీడా పోటీల్లో సుమారు 30 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు, పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ భాగ్యమణి మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు ఎలాంటి ఆత్మన్యూనతకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. పట్టుదల, కృషి, నిరంతర సాధనతో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తగిన ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు సమాజంపై కూడా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.