ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి
ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వహించాలి
- ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు/నూజివీడు, మేజర్ న్యూస్: పురపాలక సంఘాల పోలింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని, బ్యాలెట్ బాక్సుల స్వీకరణ, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను శనివారం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి కలెక్టర్ సందర్శించి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీని, కౌంటింగ్ హాలులో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్నికల విధులు అత్యంత జాగ్రత్తతో నిర్వర్తించాలన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని, కావున ఎన్నికల సిబ్బంది పోలింగ్ విధుల నిర్వహణలో ఎటువంటి అలసత్వానికి తావులేకుండా చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది తమకు అందించిన పోలింగ్ పరికరాలను చెక్ లిస్ట్ ప్రకారం పరిశీలించాలన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, కావున ఎన్నికల కమిషన్ నిబంధనల ననుసరించి పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పత్రాలతో నిండిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రపరచాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు రెండంచెల భద్రతను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో కౌంటింగ్ హాల్స్, టేబుల్స్, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ సరళిని పరిశీలించేందుకు వీలుగా కుర్చీల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్, కౌంటింగ్ విధులు కేటాయించిన సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన, రుచికరమైన భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ సబ్ కలెక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జెడ్పీ బాలికల హైస్కూల్ లో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.
నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, మునిసిపల్ కమీషనర్ పీరయ్య, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.