ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికల పోలింగ్ విధులపై పోలీసు సిబ్బందికి దిశానిర్దేశం
పలాస, సూర్య : ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఎన్నికల విధులకు నియమితులైన పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం ఇచ్చాపురం, పలాస–కాశీబుగ్గలో వేర్వేరుగా కాశీబుగ్గ డీఎస్పీ జి.వి. రమణ ప్రత్యేక అవగాహన కల్పించి విధులపై దిశానిర్దేశం చేశారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు ప్రతి పోలీసు సిబ్బంది పూర్తి అప్రమత్తతతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని,ఎలాంటి అలసత్వానికి తావివ్వరాదని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 100 మీటర్ల పరిధిని సున్నంతో స్పష్టంగా గుర్తించి, ఆ పరిధిలో రాజకీయ పార్టీల సమావేశాలు, జెండాలు, బ్యానర్లు, కటౌట్లు లేకుండా చూడాలని, 200 మీటర్ల పరిధికి వెలుపల మాత్రమే తెల్ల కాగితంపై ముద్రించిన ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలని, ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు కార్డులను పరిశీలించిన అనంతరమే ఓటర్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని అడ్డుకోవాలని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి రాజకీయ ప్రచార సామగ్రి కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ నలుగురికి మించి వ్యక్తులు గుమిగూడకుండా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, బారికేడ్లు, గేట్లు తదితర భద్రతా ఏర్పాట్లను ముందుగానే తనిఖీ చేయాలని, మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల అధికారులు, ఇతర పోలీసు సిబ్బందితో సమన్వయం పాటిస్తూ, ఆర్వో ఆదేశించినప్పుడు మాత్రమే పోలింగ్ స్టేషన్లోకి వెళ్లాలని, ఓటర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, క్యూ లైన్లను క్రమబద్ధంగా నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించేలా వారి ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని, రూట్ మొబైల్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, కేటాయించిన సమయానికి విధుల్లో చేరి బ్యాలెట్ బాక్సులను నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలించడంతో పాటు పోలింగ్ ముగిసిన అనంతరం పోలీసు భద్రత నడుమ నిర్దేశిత భద్రతా కేంద్రాలకు చేర్చాలని, ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రతతో పాటు కౌంటింగ్ ప్రక్రియకు కూడా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.ఎన్నికల విధుల్లో ఎలాంటి అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో, పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, కాశీబుగ్గ, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సై లు పాల్గొన్నారు.