జీవన్‌దాన్ సహకారంతో అపోలో ఆసుపత్రిలో అవయవదానం * నలుగురికి పునర్జన్మ *
ఆరిలోవ, సూర్య : విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం, పాతవలస పోస్టుకు చెందిన కోట్యాడ సూరిబాబు (40) ప్రమాదవశాత్తు కిందపడటంతో తలకు తీవ్ర గాయమైంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయనను అక్టోబర్ 27వ తేదీ రాత్రి 8:40 గంటలకు విశాఖపట్నంలోని ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.వైద్యులు సూరిబాబుకు అవసరమైన చికిత్స అందించినప్పటికీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం ఆయన బ్రెయిన్ డెడ్ (మెదడు మరణం)అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
అపోలో ఆసుపత్రి యాజమాన్యం జీవనధన్ సహకారంతో కుటుంబ సభ్యులకు అవయవదానాన్ని ప్రోత్సహించడంతో తీవ్ర విషాదంలోనూ సూరిబాబు కుటుంబ సభ్యులు గొప్ప మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకొచ్చారు. జీవన్‌దాన్ సహకారంతో అవయవదాన ప్రక్రియను సమన్వయం చేసి, ఆయనకు చెందిన **రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయాన్నిదానం చేశారు. ఈ అవయవదానం ద్వారా అవసరమైన నలుగురు రోగులకు కొత్త జీవితం లభించే అవకాశం ఏర్పడింది. మరణానంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన సూరిబాబు అవయవదానం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఈ మహోన్నత నిర్ణయం తీసుకున్న ఆయన కుటుంబ సభ్యుల ఔదార్యం, అవయవదాన ప్రక్రియకు సహకరించిన అపోలో ఆసుపత్రి, జీవన్‌దాన్ బృందం కృషి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.