ఆ ఉన్మాదిని వదిలే ప్రసక్తే లేదు.. పరిటాల సునీత
అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి తనను ఎంతో కలచి వేసిందని.. ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఈ ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే ఆసుపత్రికి చేరుకున్న ఆమె, చికిత్స పొందుతున్న గోపికను చూశారు. అలాగే ఈ దాడిలో గాయపడిన మరో విద్యార్థిని, షాక్ గురైన మరో విద్యార్థిని పరామర్శించారు. గోపిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిచే ఫోన్లో వారిని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం.. అందునా అంత దారుణంగా దాడి చేయడం కలిచి వేసిందన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారన్నారు. ముగ్గురు నేతలూ నేరుగా ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారని.. తీవ్ర ఆవేదనకు గురైన తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారన్నారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని గట్టి భరోసా ఇచ్చారు. నిందితుడు ఎంతటి వాడైనా సరే, చట్టం ముందు కఠినంగా శిక్షిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ యాక్షన్ అత్యంత వేగంగా, కఠినంగా ఉంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థుల రక్షణ కోసం ఇకపై ప్రతి పాఠశాల ప్రాంగణంలో భద్రతా నియమాలను కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి మెరుగైన వైద్యంతో పాటు, ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను త్వరితగతిన అందిస్తామన్నారు. నియోజకవర్గంలో మహిళలు, బాలికల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే సునీత తెలిపారు..