గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి. జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్.
అనంతపురం, రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ చికిత్స పొందుతున్న విద్యార్థినిని, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని సూచించారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైతే మరింత మెరుగైన వైద్యం కోసం ఇతర ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన వైద్య సదుపాయాలు, రవాణా ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిలో వస్తున్న మార్పులను నిరంతరం గమనించాలని, చికిత్సకు సంబంధించి ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని వైద్య బృందానికి తెలిపారు. అనంతరం బాధిత విద్యార్థిని తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. విద్యార్థినిపై దాడికి పాల్పడిన నిందితుడిని కచ్చితంగా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.