*హిరమండలంలో కూటమి జోరు.. ఎంపీటీసీ స్థానాలే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం*
హిరమండలం, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హిరమండలం మండలంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని హిరమండలం 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు నాయకులతో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను, వ్యాపారస్తులను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. హిరమండలం జడ్పీటీసీ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సిరిపురం త్రివేణికి కమలం గుర్తుపై, హిరమండలం 1, 2 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతూ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పోతురాజు శ్రీధర్, ఎంపీటీసీ అభ్యర్థి పొగిరి బుచ్చిబాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి పనుకు సూర్యనారాయణ, లాడి కృష్ణ, మండల అధ్యక్షుడు పారాసెల్లి తిరుపతి తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.