అకాల వర్షంతో నేలకొరిగిన వరి పంటలు – రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులకు పరిహారం అందించాలి: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు
అకాల వర్షంతో నేలకొరిగిన వరి పంటలు – రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి రైతులకు పరిహారం అందించాలి: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు
మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా కోత దశకు చేరుకున్న వరి పంటలు నేలకొరిగాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో వరి పొలాలు నేలమట్టమయ్యాయని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక, బోర్లు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిన సమయంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో రైతులు పంటలను కాపాడుకున్నారని పేర్కొన్నారు.
మరో వారం, పది రోజుల్లో వరి కోతలు ప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో నిలువుగా ఉన్న వరి పంటలు నేలకొరిగి రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెట్టుబడుల భారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ అకాల వర్షం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారిందన్నారు.
రైతే దేశానికి వెన్నెముక అని చెప్పే పాలకులు ఆ మాటలను చేతల్లో చూపించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులను గ్రామాలకు పంపించి మండలాల వారీగా పంట నష్టాన్ని అంచనా వేయించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం నిర్ణయించి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోకపోతే రైతులను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని బంటు వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఈ పంట పొలాల పరిశీలనలో రైతులు గువ్వల రామలింగం, గువ్వల నగేష్, బంటు సతీష్, చిమ్టా ఆంజనేయులు, మల్లెబోయిన మట్టయ్య, గువ్వల శీను, బంటు ధర్మయ్య, దుండియాల శీను, గువ్వల మహేష్, వెంకన్న, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.