తెలంగాణ సచివాలయం వేదికగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం
హైదరాబాద్ మేజర్ న్యూస్ ( సిటీ ప్రతినిధి ):హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జలమండలి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యక్రమం ఆదివారం సచివాలయం వేదికగా ప్రారంభమైంది. జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాగునీటి వనరుల సంరక్షణ, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగానికి జలమండలి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. తాగునీటిని ప్రధానంగా తాగడానికి, గృహ అవసరాలకు వినియోగిస్తూ, నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్, పార్కుల నిర్వహణ తదితర తాగేతర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా మంచినీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించి, సుస్థిర నీటి నిర్వహణకు బాటలు వేస్తున్నట్లు జలమండలి ఎండీ శ్రీ కె. అశోక్ రెడ్డి తెలిపారు.
నగరంలో నిర్మాణ పనులు, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్, పార్కుల నిర్వహణ, పచ్చదనం అభివృద్ధి, ఇతర తాగేతర అవసరాలకు మంచినీటికి బదులుగా మురుగునీటి శుద్ధి కేంద్రాల (STPలు) ద్వారా శుద్ధి చేసిన నీటిని గ్రీన్ వాటర్ ట్యాంకర్లతో సరఫరా చేయనున్నారు. ప్రభుత్వ శాఖలు, ఉద్యానవనాలు, గ్రీనరీ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రాబోయే ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు ఎండీ తెలిపారు. ప్రస్తుతం ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు వినియోగిస్తున్న సుమారు తాగునీటిని ఆదా చేసే దిశగా, ఆ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
తొలివిడతలో 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్లు:
తొలివిడతలో నగరంలోని 19 ఎస్టీపీల నుంచి 21 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అత్తాపూర్‌లో 5, అంబర్‌పేట్‌లో 3, మీరాలంలో 2, నాగోల్‌లో 2, ముల్కత్వ చెరువు వద్ద 2, కోకాపేట్‌లో 1, గోపన్‌పల్లిలో 1, లింగంకుంటలో 1, నల్లచెరువు వద్ద 2, హుస్సేన్ సాగర్ ఎస్టీపీ వద్ద 2 ట్యాంకర్లను, సరూర్‌నగర్, లింగంకుంటా, గోపన్ పెట్, ఖాజాగూడా, నానక్రామ్ గూడా, మియాపూర్-పటేల్ చెరువు, వెన్నల గడ్డ ఎస్టీపీలలో గ్రీన్ టాంకర్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అనంతరం నగరవ్యాప్తంగా అన్ని డివిజన్లకు ఈ సేవలను విస్తరించనున్నారు.
ఇప్పటివరకు 100 గ్రీన్ ట్యాంకర్లతో ట్రీటెడ్ వాటర్ :
గ్రీన్ వాటర్ సరఫరా కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఇప్పటివరకు జిహెచ్ ఎంసీ, హెచ్ఏండీఏతో పాటు ప్రయివేట్ సంబందించిన సుమారు సుమారు 100 ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి వద్ద నమోదు చేసుకున్నాయి. వీటి ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరాను దశలవారీగా విస్తరించనున్నారు. ట్యాంకర్ల నిర్వహణలో పారదర్శకత కోసం ప్రత్యేక బుకింగ్ వ్యవస్థ, జీపీఎస్ ట్రాకింగ్, ఈ-పీఓఎస్ విధానాలను అమలు చేయనున్నారు.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ:
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ కోసం ఎస్టీపీల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు ఫిల్లింగ్ పాయింట్ల నిర్వహణ, ట్యాంకర్ల కేటాయింపు, నీటి నాణ్యత, సరఫరా కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ప్రతి ట్యాంకర్ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగులో ఉండాలని, జలమండలి నిర్దేశించిన నమూనా ప్రకారం ప్రత్యేక బ్రాండింగ్ చేయాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్లపై ‘ఎస్ టి పి ట్రీటేడ్ వాటర్.. నాట్ ఫర్ డ్రింక్ అనే హెచ్చరికను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.
*తాగునీటి సంరక్షణలో భాగస్వాములు కావాలి:*
తాగునీటిని తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలని, నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, మొక్కల పెంపకం, ఇతర తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ శాఖలు, నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు, ప్రజలు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఎండీ అశోక్ రెడ్డి కోరారు.
167 నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరణ:
జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి ఎండీ అశోక్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు తొలుత 167 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటైన జలమండలి, ప్రస్తుతం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించిందని గుర్తుచేశారు. గత 37 ఏళ్లలో అనేక మైలురాళ్లను అధిగమించి, ఎన్నో విజయాలు, పురస్కారాలు సాధించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా సేవలను మరింత విస్తరిస్తూనే, నీటి సంరక్షణ, పునర్వినియోగం, సుస్థిర అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.