andhrapradesh
పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు....
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
విజయనగరం సూర్య: విజయనగరం జిల్లాలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు చర్యలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, పక్కా ప్రణాళికతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ… పోలింగ్ ప్రారంభం నుంచి రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, జోనల్ స్ట్రైకింగ్ ఫోర్సులను నిరంతరం అప్రమత్తం చేస్తూ, వైర్‌లెస్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేయడం సత్ఫలితాలిచ్చాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం, పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తుల సంచారాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపట్టడం వలన గొడవలు జరగకుండా నియంత్రించగలిగామన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, పట్టణంలోని ముఖ్య కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించామన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రూట్ మొబైల్ పార్టీలు, ప్రత్యేక బలగాలు సమన్వయంతో విధులను సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, అక్కడ నిరంతర పహారా ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. ఎన్నికల విధులను సమన్వయంతో, సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా ఎన్నికలను ప్రశాంతంగా ముగించడంలో సహకరించిన ప్రజలకు జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.