ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక
ఈ సందర్భంగా కరీంనగర్ నేతలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకే దేశంలోని 40 ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లోనూ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఆచూకీ లేనివారు, డబుల్ ఓట్లు ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని, అక్రమంగా ఓటు హక్కు పొందిన వారి పేర్లను తొలగించాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు సైతం సముచితమైన అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు.విదేశీ శక్తుల అండతో కాంగ్రెస్ ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కుట్రలను ప్రజలకు వివరించేందుకు కరీంనగర్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు జన సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టుగా కార్యకర్తలను, ప్రజలను తరలించాలని, డివిజన్ల వారీగా ఇన్‌చార్జీలను నియమించి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మహిళా గ్రూపుల కంటే సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలన్నారు. కరీంనగర్ నగరంలో పార్టీ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ నాయకులు, కార్యకర్తలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ పనిచేసిన వారికే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అవినీతి ఆరోపణలకు తావివ్వకూడదని హెచ్చరించారు. అనుమతులు, భూముల వ్యవహారాల్లో ఎవరిపైనా ఆరోపణలు వచ్చినా ఉపేక్షించబోమన్నారు. షాపుల వద్ద వసూళ్లు చేయడం, పనుల కోసం డబ్బులు డిమాండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను సహించేది లేదన్నారుఈ సమావేశంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ మేయర్ డి.శంకర్, బాస సత్యనారాయణ, నల్లాల ఓదెలు, కోమాల ఆంజనేయులు, గుజ్జ శ్రీను, రమేష్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.