telangana
ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
Telangana
01 Nov 2026
49 views
సూర్య, మందమర్రి.;;సంస్థ అభివృద్ధికి నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం కీలకమని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ పేర్కొన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆదేశాల మేరకు సింగరేణి మందమర్రి ఏరియాలో నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సీఈఆర్ క్లబ్, రామకృష్ణాపూర్‌లోని ఆర్‌కేసీఓఏ క్లబ్, మందమర్రిలోని ఇల్లందు క్లబ్‌లలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణతో పాటు ఏరియా ఉన్నతాధికారులు ఆయా కార్యక్రమాలకు హాజరై వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది “నిజాయితీతో సమృద్ధి” అనే ప్రధాన నినాదంతో అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు ఏరియాలోని అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు విధి నిర్వహణలో నైతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత నిజాయితీతో పాటు సమష్టి బాధ్యతను అలవర్చుకున్నప్పుడే సంస్థ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. స్వతంత్ర భారత తొలి హోంశాఖ మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. సింగరేణి సంస్థను ప్రగతి పథంలో నడిపించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నిజాయితీని కేవలం విధి నిర్వహణకే పరిమితం చేయకుండా, జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పౌరుల సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి రహిత పాలన, పారదర్శకమైన విధానాలు, బాధ్యతాయుతమైన సేవలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఏరియాకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ట్యాగ్లు:
News