ఉప్పాడ చేనేతకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
సూర్య, ఉప్పాడ, కొత్తపల్లి (న్యూస్‌డెస్క్):కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేనేత కళకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో మన ఆంధ్రప్రదేశ్ చేనేత వైభవం మరోసారి వెలిగిపోయింది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 'దైవం గంగాధరం అండ్ సన్స్', 'త్రినాథ్ ఫ్యాబ్రిక్స్', 'ఉప్పాడ వీవ్స్' (దైవం మహేశ్వరరావు, దైవం త్రిమూర్తులు) తరఫున దైవం ఉదయ్ కుమార్ స్వామి, బత్తుల వెంకటరమణలు ప్రతిష్ఠాత్మక ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చేనేత ప్రతినిధులు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఉప్పాడ జమ్‌దానీ' చీరను కానుకగా అందజేశారు.
దేశ అత్యున్నత నాయకుడికి ఉప్పాడ జమ్‌దానీ చీరను బహుకరించి, దాని ప్రాశస్త్యాన్ని, చేనేత కళల వైభవాన్ని వివరిస్తూ దేశవ్యాప్తంగా పరిచయం చేయడం ఎంతో గర్వకారణమని ఉదయ్ కుమార్, వెంకటరమణలు హర్షం వ్యక్తం చేశారు. "మన చేనేత - మన వారసత్వం - మన గర్వం" అని చాటిచెప్పేలా ఉప్పాడ నేతన్నల నైపుణ్యానికి జాతీయ వేదికపై గుర్తింపు లభించడం పట్ల స్థానిక చేనేత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.