ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తికి సజీవ స్ఫూర్తి వల్లభ్‌భాయ్ పటేల్
కృష్ణ సూర్య న్యూస్ :
ఐక్యత, క్రమశిక్షణ, అచంచలమైన దేశభక్తికి స్ఫూర్తిప్రదాత భారతదేశ తొలి ఉప ప్రధాని, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అని బీజేపీ మండల అధ్యక్షులు నల్లె నర్సప్ప, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని శ్రీ క్షీరలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో శనివారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు మాట్లాడుతూ...
స్వాతంత్య్రానంతరం దేశం అనేక భాగాలుగా విడిపోయిన క్లిష్ట సమయంలో, చాకచక్యంతో 500కు పైగా సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి అఖండ భారతదేశాన్ని ఆవిష్కరించిన మహానీయుడు పటేల్ అని కొనియాడారు.
ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం నైజాం పాలనలో బంధీగా ఉన్న సమయంలో పటేల్ చూపిన వ్యూహాత్మక చతురత చారిత్రాత్మకమైనదన్నారు. నైజాం ప్రభుత్వంపై బలమైన ఒత్తిడి తెచ్చి, నలుదిక్కుల నుండి భారత సైన్యాన్ని మోహరించి, నైజాం ప్రభువును లొంగదీసుకుని హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారని గుర్తుచేశారు. ఆయన చూపిన ధైర్యం, కనబరిచిన నైతిక బలం నేటి తరానికి ఆదర్శమని, ప్రతీ ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలన్నారు. అదేవిధంగా పటేల్ చూపిన క్రమశిక్షణను మార్గదర్శకంగా తీసుకుని దేశసేవలోను ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు దండు రాఘవేంద్ర, సచిన్ భట్, సీనియర్ నాయకులు డి.కె. కిష్టప్ప, అజిత్ దీక్షిత్, కె. ఆంజనేయులు, పల్లె రాము,కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం