క్రైస్తవ సమాజంలో సంస్కరణలు రావాలి - పల్లె శాంతిరాజ్
సూర్య - పెద్దపల్లి రూరల్ 01: నేటి క్రైస్తవ సమాజం సంస్కరణ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి పార్లమెంట్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ కోఆర్డినేటర్ పల్లె శాంతిరాజ్ అన్నారు. క్రైస్తవ సంస్కరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. గతంలో పాప పరిహార పత్రాల పేరుతో దోపిడీ జరిగితే, నేడు ప్రార్థన కర్చీఫ్‌ల పేరుతో భక్తులను మోసం చేస్తున్నారని విమర్శించారు. దేవునిపై విశ్వాసం పెంచుకోవాల్సిన క్రైస్తవులు కొందరి గారడీ బోధనలతో దారి తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం పెద్ద నాయకులు గళం విప్పకపోవడం విచారకరమన్నారు .మార్టిన్ లూథర్, జాన్ కాల్విన్, విలియం టిండేల్, స్వింగ్లీ వంటి సంస్కరణ యోధుల జీవిత చరిత్రలను వివరిస్తూ త్వరలో 'ఆత్మీయ విప్లవకారులు' పేరుతో పుస్తకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. భక్తి ముసుగులో జరిగే మోసాలను అరికట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.