భూసేకరణ భూముల వివరాలు భూ భారతి రికార్డుల్లో నమోదు చేయాలి -నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన కాలువల నిర్మాణం కోసం భూసేకరణ ద్వారా సేకరించిన భూముల వివరాలను భూ భారతి పోర్టల్‌తో పాటు రెవెన్యూ రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, భూసేకరణ ప్రత్యేక అధికారి అరుణ రెడ్డితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసేకరణ ద్వారా నీటిపారుదల శాఖకు బదిలీ అయిన భూముల వివరాలను సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.
జిల్లాలోని 75 గ్రామాల్లో భూముల రీ-సర్వే కొనసాగుతుండగా, ఇప్పటివరకు 15 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. ఆయా గ్రామాల్లో నీటిపారుదల శాఖకు బదిలీ అయిన భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించి భూ భారతి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ అధికారులు అమర్ సింగ్, లింగాల్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ నారాయణ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్.