అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'! విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్.
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్
అట్టహాసంగా ముగిసిన 'మోహన మంత్ర'!
విద్యార్థుల మేధస్సుకు పట్టం కట్టిన టెక్నో-కల్చరల్ ఫెస్ట్!
చంద్రగిరి మండలం ఏ.రంగంపేట సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీలో రెండు రోజుల పాటు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన జాతీయ స్థాయి టెక్నో-కల్చరల్ ఫెస్ట్ 'మోహన మంత్ర' శనివారం ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిమంది విద్యార్థులు తరలివచ్చి ఈ వేడుకను ఎంతగానో ఆస్వాదించారు. ఇతర విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఈ ఉత్సవాల సందర్భంగా వెలుపలి ప్రాంతాల నుంచి దాదాపు 10,000కు పైగా ఎంట్రీలు నమోదు కాగా, పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు లక్ష రూపాయలకు పైగా నగదు బహుమతులను అందజేశారు.
ఈ వేడుకల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన సాంకేతిక, సాంస్కృతిక, వినోదాత్మక ఈవెంట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. వెల్కం ఈవెంట్, డాన్స్ వామ్-అప్, బ్యాండ్ బ్యాటిల్ ఫైనల్స్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ షోకేస్, టగ్ ఆఫ్ వార్, గల్లీ క్రికెట్ ఫైనల్స్, క్లే మోడెల్లింగ్, లైఫ్ సేవర్ లాబ్, డ్రోన్-ఎక్స్ ఛాలెంజ్, బ్రిడ్జ్-ఓ-మానియా, హ్యాక్-స్ప్రింట్, క్యాడ్ మాస్టర్స్ ఫైనల్ రౌండ్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ డిస్‌ప్లే, ఓపెన్ మైక్, రాంప్ వాక్, డిజే షో వంటి ఎన్నో ఆసక్తికరమైన కార్యక్రమాలు సభలో సందడి నింపాయి. ముఖ్యంగా రెండు రోజుల పాటు విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహించిన హ్యాకథాన్‌లలో నూతన సాంకేతిక పరిష్కారాలను చూపిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయా సంస్థలు నేరుగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. అధ్యాపకుల ప్రమేయం లేకుండా పూర్తిగా విద్యార్థులే తమ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలతో ఈ భారీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జాతీయ స్థాయి ఫెస్ట్ విజయవంతం కావడానికి సహకరించిన విద్యార్థులు, అధ్యాపకులు, ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులకు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి