పట్టణ సుందరీకరణ పేరుతో నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదు – బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్
పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదల ఉపాధిని తొలగించాలనే మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం బిఎస్పీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. కొల్లాపూర్ చౌరస్తాలో ఎస్పీ కార్యాలయం పక్క నుంచి చౌరస్తా వరకు దాదాపు 10 మంది నిరుపేదలు చిన్న చిన్న డబ్బాలు ఏర్పాటు చేసుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరు రోజుకు కేవలం రూ.200 నుంచి రూ.300 వరకు సంపాదించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని, అంతే కాకుండా ప్రతిరోజూ రూ.50 నుంచి రూ.100 వరకు తైబజార్ రుసుము కూడా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక నిరుపేదలు పట్టణాలకు వలస వస్తున్నారని, మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎల్నినో ప్రభావం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న ప్రస్తుత తరుణంలో పేదలకు ఉన్న కొద్దిపాటి ఉపాధిని కూడా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించకపోయినా పర్వాలేదు కానీ, ఇప్పటికే జీవనోపాధి పొందుతున్న పేదల పొట్ట కొట్టడం మాత్రం తగదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మున్సిపల్ అధికారులకు డబ్బాల సమస్య తప్ప పట్టణంలో పరిష్కరించాల్సిన ఇతర సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నవంబర్ 3వ తేదీలోగా డబ్బాలను తొలగించాలని గడువు విధించడం పేదల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పట్టణ సుందరీకరణ పేరుతో నిరుపేదల జీవనోపాధిని దెబ్బతీయడం సరికాదని, పట్టణ అభివృద్ధితో పాటు పేదల ఉపాధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదల ఉపాధికి ఎలాంటి భంగం కలగకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వారి జీవనోపాధిని తొలగించవద్దని స్పష్టం చేశారు. నిరుపేదలకు అండగా బిఎస్పీ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని, ఈ సమస్యపై కలిసి వచ్చే అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి పేదల సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరుతామని పృథ్వీరాజ్ తెలిపారు. అవసరమైతే పేదల తరపున నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ తాడూరు మండల అధ్యక్షులు జన్ను ఆంజనేయులు, పద్మ, లావణ్య, బాలిశ్వరమ్మ, గీత తదితరులు పాల్గొన్నారు.
పి. విజయ్ కుమార్,నాగర్ కర్నూల్ ప్రతినిధి, సూర్యన్యూస్