### పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని బర్తరఫ్ చేయాలి జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజుపై పార్టీ నాయకుల తీవ్ర ఆరోపణలు బొర్రంపాలెం సమావేశంలో పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్
టి.నరసాపురం,, మేజర్ న్యూస్:జనసేన పార్టీలో ఉంటూ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న మండల అధ్యక్షుడు అడపా నాగరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పోలవరం నియోజకవర్గ ఏఎంసీ డైరెక్టర్ జట్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ మండలంలో జనసేన పార్టీని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శనివారం బొర్రంపాలెంలో గ్రామ జనసేన కమిటీ అధ్యక్షుడు కంపసాటి రమేష్ ఆధ్వర్యంలో, బొర్రంపాలెం ఎంపీటీసీ-1 స్వతంత్ర అభ్యర్థి గేనాల కృష్ణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జట్ల సత్యనారాయణ మాట్లాడారు.
పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
మండలంలో జనసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. మండల జనసేన కమిటీలో నియోజకవర్గ స్థాయికి చెందిన 32 మంది సభ్యులు ఉండగా, వారిలో ఎనిమిది మంది టి.నరసాపురం మండలానికి చెందినవారని తెలిపారు. అయినప్పటికీ స్థానిక నాయకులను సంప్రదించకుండా బొర్రంపాలెం ఎంపీటీసీ-1 స్థానంలో అభ్యర్థిని ఖరారు చేశారని ఆరోపించారు. పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న కార్యకర్తలకు బీ-ఫారాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు.
పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం
పోలవరం నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త చింతలపూడి నవీన్ మాట్లాడుతూ.. 2014 నుంచి జనసేన పార్టీ కోసం ప్రజల్లోకి వెళ్లి, గ్లాసు గుర్తును ప్రజలకు పరిచయం చేస్తూ జెండాలు మోసిన కార్యకర్తలకు నేడు పార్టీలోనే అన్యాయం జరగడం బాధాకరమన్నారు. తమ ఆవేదనను జనసేన రాష్ట్ర, జిల్లా నాయకత్వం అర్థం చేసుకోవాలని కోరారు.
ముఖ్యంగా ఏపుగుంట ఎంపీటీసీ స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థి పోటీలో ఉండి, గ్లాసు గుర్తు కేటాయించినప్పటికీ, పార్టీకి అతీతంగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థికి మండల అధ్యక్షుడే దగ్గరుండి ప్రచారం చేయడం, గ్లాసు గుర్తుకు ఓటు వేయవద్దని చెప్పడం పార్టీకి వెన్నుపోటు పొడవడమేనని విమర్శించారు. బీ-ఫారాల విషయంలో అక్రమాలకు పాల్పడుతూ, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
చర్యలు తీసుకోకపోతే మంగళగిరిలో నిరసన
పార్టీకి ద్రోహం చేస్తున్న వారిపై జనసేన అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. స్పందన లేకపోతే పార్టీ కార్యకర్తలు, జనసైనికులతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని చింతలపూడి నవీన్ హెచ్చరించారు.
బొర్రంపాలెం ఎంపీటీసీ-1 స్థానంలో పార్టీ గుర్తు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి రావడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ప్రజల సహకారంతో అభ్యర్థిని గెలిపించి ఆ విజయాన్ని పార్టీకి అంకితం చేస్తామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
భారీ పోటీ ఇస్తున్నాం.. గేనాల కృష్ణ
బొర్రంపాలెం ఎంపీటీసీ-1 స్వతంత్ర అభ్యర్థి గేనాల కృష్ణ మాట్లాడుతూ.. బొర్రంపాలెం వైసీపీకి కంచుకోటగా పేరున్నప్పటికీ, ప్రజల్లో తనపై ఉన్న అభిమానంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నానన్నారు. పార్టీ గుర్తు ఉండి ఉంటే భారీ మెజారిటీతో విజయం సాధించేవాడినని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో పోలవరం ఏఎంసీ డైరెక్టర్లు జట్ల సత్యనారాయణ, తొమ్మిదేళ్ల శ్రీను,కాలనీడి నారాయణరావు, సత్తిబాబు, నాయుడు,కొప్పుల గంగబాబు,మధ్యాహ్నంపు పెంటారావు,మాండ్రు రాము,కంపసాటి రమేష్, జబ్బ నాగరాజు,తేజ, ప్రకాష్,మధు,సునీల్, లక్ష్మీనారాయణ, నరసింహారావు,తోట సత్యనారాయణ,రామకృష్ణ బీరం సాయి,శివరామకృష్ణ, తోపాటు జనసేన పార్టీ అభిమానులు పాల్గొన్నారు.