telangana
దీక్షా దివస్‌ను పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణుల ఘన నివాళులు
సూర్య, మందమర్రి : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అప్పటి ఉద్యమ నాయకుడు, ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగి రాష్ట్ర సాధన దిశగా ప్రజల్లో మరింత చైతన్యం వచ్చిందని పేర్కొన్నారు. ఆదివారం దీక్షా దివస్‌ను పురస్కరించుకుని మందమర్రి పట్టణంలో పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. పట్టణంలోని జయశంకర్ సార్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం ప్రకటించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరాహార దీక్షకు పూనుకున్న కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. నాడు ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అన్న నినాదంతో సాగిన దీక్ష యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర సాధనలో కీలక ఘట్టంగా నిలిచిన దీక్షా దివస్‌ను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయడమేనని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వం మళ్లీ రాష్ట్రానికి అవసరమని, ఆయన తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, టిబిజికేఎస్ యూనియన్ నాయకులు, వార్డు అధ్యక్షులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.