telangana
ఎల్లూరు సెల్ టవర్ వద్ద భద్రత కరువు.. ఆందోళనలో గ్రామస్తులు
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని ఎల్లూరు గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన సెల్ టవర్ ప్రమాదకరంగా మారింది. టవర్ చుట్టూ కనీసం రక్షణ కంచె లేకపోవడం, పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో అటుగా రాకపోకలు సాగించే ప్రజలు, పశువులకు ప్రమాదం పొంచి ఉంది. టవర్ పరిసరాల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సెల్ టవర్ల చుట్టూ ఇతరులు లోపలికి వెళ్లకుండా పటిష్టమైన రక్షణ కంచె, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ అలాంటి ఏర్పాట్లు కనిపించడం లేదు. టవర్‌కు సంబంధించిన వైర్లు, పరికరాలు సైతం బహిరంగంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు పక్కనే టవర్ ఉండటంతో నిత్యం ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగిస్తుంటారు. అదే ప్రాంతంలో పశువులు కూడా మేత కోసం తిరుగుతుంటాయి.ముఖ్యంగా చిన్నపిల్లలు, పశువులు ప్రమాదవశాత్తు టవర్ సమీపంలోకి వెళ్లినా, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాల ముప్పు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ, విద్యుత్, టెలికాం శాఖల అధికారులు సమన్వయంతో స్పందించి సెల్ టవర్ చుట్టూ పటిష్టమైన రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ప్రమాదకర పరిస్థితిని అధికారులు ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఏదైనా ప్రమాదం జరగక ముందే స్పందించి ప్రజలు, పశువుల ప్రాణాలను కాపాడాలని ఎల్లూరు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.