సిక్కిం తొలి రైలు మార్గానికి కీలక మైలురాయి
సూర్య జాతీయ డెస్క్: సిక్కిం రాష్ట్రానికి మొట్టమొదటి రైలు మార్గం అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. 45 కిలోమీటర్ల పొడవైన శివోక్ - రంగపో కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టులోని మొత్తం 14 సొరంగాల తవ్వకం పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత పొడవైన 5.3 కిలోమీటర్ల టన్నెల్ నంబర్ 10 తవ్వకం నవంబర్ 27న పూర్తికావడంతో, సిక్కింను జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే కలకు మరింత బలం చేకూరింది.
టన్నెల్ నంబర్ 10 తవ్వకాన్ని రెండు చివరల నుంచి, మరో రెండు యాక్సెస్ సొరంగాల సహాయంతో ఏకకాలంలో చేపట్టగా, అన్ని వైపుల నుంచి తవ్వకం మార్గాలు కలిసిపోవడంతో ప్రధాన తవ్వకం ఘట్టం ముగిసింది. ఇకపై సొరంగాల లైనింగ్, రైలు పట్టాల ఏర్పాటు, అత్యవసర రైల్వే భద్రతా వ్యవస్థల అమరిక వంటి తదుపరి పనులు వేగవంతం కానున్నాయి. సవాళ్లతో కూడిన హిమాలయ పర్వత ప్రాంతంలో సాగుతున్న ఈ 45 కిలోమీటర్ల మార్గంలో మొత్తం దూరంలో దాదాపు 86 శాతం భాగం సొరంగాల గుండానే సాగడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతను చాటుతోంది.
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్, కాలింపాంగ్ జిల్లాలతో పాటు సిక్కింలోని పాక్యోంగ్ జిల్లా మీదుగా ఈ రైలు మార్గం నిర్మితమవుతోంది. 23 వంతెనలతో కూడిన ఈ ప్రాజెక్టులో శివోక్, రియాంగ్, మెల్లి, రంగపో స్టేషన్లతో పాటు తీస్తా బజార్ వద్ద భూగర్భ హాల్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. శివోక్ వద్ద ఈ కొత్త లైన్ ఇప్పటికే ఉన్న న్యూ జల్పైగురి - అలీపుర్దువార్ రైలు మార్గంతో కలుస్తూ జాతీయ రైల్వే వ్యవస్థతో అనుసంధానమవుతుంది.
ఈ రైలు మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, సిక్కిం వాసులకు మరియు పర్యాటకులకు జాతీయ రహదారి 10 కంటే సురక్షితమైన, వేగవంతమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. నిత్యావసర సరుకుల రవాణా సులభతరం కావడంతో పాటు, స్థానిక వ్యాపారాలకు విస్తృత మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని, తద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.