ఆయుధ ఎగుమతుల నిబంధనల సడలింపునకు స్విస్ ఓటర్ల మద్దతు
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఆయుధ ఎగుమతులు మరియు పునఃఎగుమతులపై ఉన్న కఠిన నిబంధనలను సడలించే ప్రతిపాదనకు స్విట్జర్లాండ్ ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు ప్రాథమిక ఫలితాలు, అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఆదివారం జరిగిన జాతీయ ప్రజాభిప్రాయ సేకరణలో వార్ మెటీరియల్ యాక్ట్ సవరణకు అనుకూలంగా ఓటర్లు మొగ్గు చూపినట్లు తొలి లెక్కింపు గణాంకాలు స్పష్టం చేశాయి. తటస్థత, మానవతా విధానాల సంప్రదాయానికి, మారుతున్న భద్రతా పరిస్థితులు, రక్షణ పరిశ్రమ అవసరాలకు మధ్య నెలకొన్న చర్చ నేపథ్యంలో ఈ ఓటింగ్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
సవరించిన చట్టం ప్రకారం, సాయుధ ఘర్షణలలో పాల్గొంటున్న దేశాలకు ఆయుధ ఎగుమతులపై ఉన్న సాధారణ నిషేధం నుంచి 36 భాగస్వామ్య దేశాలకు మినహాయింపు లభించనుంది. అయితే, ఈ ఎగుమతులన్నీ స్విట్జర్లాండ్ తటస్థత చట్టానికి, విదేశీ, భద్రతా విధాన ప్రయోజనాలకు, అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది. అన్ని ఎగుమతులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉంటుందని, రక్షణ సరఫరా గొలుసులలో స్విస్ సంస్థలు భాగస్వామ్యం కొనసాగించడానికి ఈ సవరణ దోహదపడుతుందని ప్రభుత్వం, పార్లమెంటు సమర్థించాయి.
ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దాడి తర్వాత ఐరోపా భద్రతా వాతావరణంలో ప్రాథమిక మార్పులు చోటుచేసుకున్నాయని స్విస్ ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. ఈ మార్పుల దృష్ట్యా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలతో రక్షణ సమన్వయం బలోపేతం కావాలని పేర్కొంది. మరోవైపు, ఈ సవరణ వల్ల స్విస్ ఆయుధాలు ఘర్షణ ప్రాంతాలకు చేరే ప్రమాదం పెరుగుతుందని, ఇది దేశ దీర్ఘకాల తటస్థ విధానాన్ని బలహీనపరుస్తుందని వ్యతిరేకించిన వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆయుధ ఎగుమతుల అంశంతో పాటు బాణసంచా వాడకంపై పరిమితులు, పింఛను నిధుల నిర్వహణ, వివాహితుల పన్ను విధానాలకు సంబంధించిన మరో మూడు ప్రతిపాదనలపై కూడా స్విట్జర్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మెజారిటీ ఓటర్లు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోగా, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.