పుణెలో 100వ సండేస్ ఆన్ సైకిల్ వేడుక
సూర్య జాతీయ డెస్క్: దేశ క్రీడా పరివర్తన, 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్య లక్ష్యాన్ని ప్రతిబింబించేలా భారత్ తొలి ఒలింపిక్ చిత్రాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఆవిష్కరించారు. మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 100వ మైలురాయి వేడుకలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఇండియా రెడీ 4 ఒలింపిక్స్ థీమ్‌తో రూపొందించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో పాటు క్రీడా తారలు మీరాబాయి చాను, శీతల్ దేవి, స్మృతి మంధాన నటించారు. పుణెలో జరిగిన ఈ వేడుకలో 50,000 మందికి పైగా సైక్లిస్టులు పాల్గొనగా, దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాలు, అన్ని జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశ ప్రజలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం ఎంతో అవసరమని, అందుకే యువత ఫిట్‌నెస్‌ను జీవనశైలిలో భాగంగా చేసుకుంటున్నారని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. 100వ సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని 2036 ఒలింపిక్ క్రీడల ఆతిథ్య బిడ్‌కు అంకితం చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 40,000కు పైగా ప్రాంతాలలో ఈ కార్యక్రమం నిర్వహించగా, రికార్డు స్థాయిలో 56,000 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని తెలిపారు. మై భారత్ వాలంటీర్లు 1.5 లక్షలకు పైగా మంది 600కు పైగా జిల్లాలలో సైకిల్ ర్యాలీలలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఆశయాన్ని నిజం చేశారని కొనియాడారు.
పుణె కార్యక్రమంలో 25 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల సైకిల్ రైడ్‌లను రివర్ సైక్లోథాన్ 2026 నీటి సంరక్షణ మరియు నదుల పరిశుభ్రత థీమ్‌తో నిర్వహించారు. నీటి పొదుపు, నదుల శుభ్రత, మాదకద్రవ్య రహిత భారత్ కోసం పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ చేశారు. భారత ఒలింపిక్ సంఘం సీఈఓ రఘురాం అయ్యర్‌తో పాటు ఒలింపియన్లు ప్రియాంక గోస్వామి, జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్, సందీప్ కుమార్, ఆశిష్ కుమార్ చౌదరి, స్రాబనీ నందా, యూత్ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అంబేకర్ మీతీ, ఆసియా క్రీడల పతక విజేత సుచికా తారియాల్, డేవిడ్ బెక్‌హామ్ ఎల్కాటోహ్చూంగో, బల్జీత్ కౌర్ వంటి క్రీడాకారులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
2024 డిసెంబర్ 17న పొల్యూషన్ కా సొల్యూషన్ నినాదంతో ప్రారంభమైన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 100 ఎడిషన్లలో 40 లక్షలకు పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,500కు పైగా ఫిట్ ఇండియా నమో సైక్లింగ్ క్లబ్‌లు, దాదాపు 10,000 వారపు కార్యకలాప వేదికలు ఏర్పాటయ్యాయి. నిబద్ధత, క్రమశిక్షణ, ప్రతి వారం తిరిగి వచ్చే స్ఫూర్తి ఒలింపిక్ ప్రయాణానికి ఎంతో అవసరమని, 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్, అహ్మదాబాద్ సంసిద్ధతను ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు ప్రस्तుతపరిచామని అధికారులు తెలిపారు.