రాజ్యాంగ రూపశిల్పులలో ప్రముఖులు బీఎన్ రావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
సూర్య జాతీయ డెస్క్: భారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి, దేశ రాజ్యాంగ నిర్మాణ చట్రాన్ని తీర్చిదిద్దిన ప్రముఖ న్యాయకోవిదుడు బీఎన్ రావు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఆదివారం ప్రసారమైన తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 140వ ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగిస్తూ, నవంబర్ 26న దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, నవంబర్ 30న బీఎన్ రావు వర్ధంతి అని గుర్తుచేశారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన అందించిన చారిత్రాత్మక సహకారాన్ని దేశం ఎప్పటికీ మరువదని పేర్కొంటూ హృదయపూర్వక నివాళులర్పించారు.
నెలవారీ రేడియో కార్యక్రమాన్ని ముగిస్తూ, దేశ నలుమూలల నుంచి పౌరులు పంపిన సందేశాలు, సలహాలను ప్రధాని మోదీ అభినందించారు. ప్రజలు పంచుకునే అనుభవాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యక్తులు, సమాజాలు చేస్తున్న విశేష సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే అవకాశం తనకు లభిస్తోందని తెలిపారు. శ్రోతల భాగస్వామ్యం వల్ల మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు జాతీయ స్థాయి దృష్టికి వస్తున్నాయని పేర్కొంటూ, తమ ఆలోచనలు, స్ఫూర్తిదాయక గాథలను నిరంతరం పంపాలని ప్రజలను కోరారు.
వచ్చే నెలలో ప్రసారమయ్యే తదుపరి మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రజలు పంపిన మరిన్ని స్ఫూర్తిదాయక విజయగాథలను దేశ ప్రజలతో పంచుకుంటానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న సామాన్యుల ప్రయత్నాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
మారుతున్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ పౌరులందరూ తమ ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధాని మోదీ సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ చురుకైన జీవనశైలిని అలవరచుకోవాలని, ఫిట్‌నెస్ ప్రాధాన్యతను గుర్తించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.