ప్రపంచ స్థాయిలో బిహార్, వడ్‌నగర్ మ్యూజియంలకు అరుదైన గుర్తింపు
సూర్య జాతీయ డెస్క్: భారతీయ మ్యూజియంలు, సాంప్రదాయ కళలకు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న అరుదైన గుర్తింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రసారమైన తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 140వ ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగిస్తూ, పాట్నాలోని బిహార్ మ్యూజియం, గుజరాత్‌లోని అనంత్ అనాది వడ్‌నగర్ ఆర్కియాలజికల్ మ్యూజియంలు దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని 100 అత్యుత్తమ మ్యూజియంల జాబితాలో బిహార్ మ్యూజియం 9వ స్థానాన్ని దక్కించుకుని, ఆసియాలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని తెలిపారు. పారిస్‌లోని ప్రఖ్యాత లూవ్ర్ మ్యూజియం, న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కంటే బిహార్ మ్యూజియం ముందంజలో నిలిచిందని వివరించారు.
గుజరాత్‌లోని చారిత్రక పట్టణం వడ్‌నగర్‌లో పురావస్తు తవ్వకాలు జరిగిన ప్రదేశంలోనే నిర్మించిన అనంత్ అనాది వడ్‌నగర్ ఆర్కియాలజికల్ మ్యూజియం విశిష్టతను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వివిధ చారిత్రక కాలాలకు చెందిన 5,000కు పైగా పురాతన కళాఖండాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారని, భూమి లోపల అనేక మీటర్ల లోతులో ఉన్న తవ్వకాల అవశేషాలను పైనుంచి నడుస్తూ వీక్షించేలా ప్రత్యేక మార్గాన్ని నిర్మించారని తెలిపారు. ఈ నెల ప్రారంభంలో బెర్లిన్‌లో ఈ మ్యూజియానికి ప్రతిష్టాత్మక రెడ్ డాట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవార్డు లభించిందని, ఈ గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయ మ్యూజియం ఇదేనని వెల్లడించారు. కాశీ నగరంలాగే వడ్‌నగర్ కూడా వేల సంవత్సరాలుగా సజీవంగా ఉన్న పట్టణమని, తాను వడ్‌నగర్‌లో జన్మించి కాశీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడం విశేషమని గుర్తుచేసుకున్నారు. ఇటీవల వడ్‌నగర్‌ను సందర్శించిన కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు ఈ పట్టణానికి గుజరాత్ కాశీగా గుర్తింపునిచ్చారని చెప్పారు.
కళా ప్రపంచపు ఒలింపిక్స్‌గా పిలిచే ఇటలీలోని వెనిస్ ఆర్ట్ బినాలే అంతర్జాతీయ ప్రదర్శనలో భారత పెవిలియన్ ప్రపంచ ప్రశంసలు అందుకుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ ప్రదర్శనలో భారత పెవిలియన్‌ను దాదాపు 4.5 లక్షల మంది సందర్శించారని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు దీనిని అత్యుత్తమ పెవిలియన్‌గా ఎన్నుకున్నారని తెలిపారు. సంప్రదాయ కళారూపాలను ఆధునిక దృక్పథంతో ప్రదర్శించడం ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని భారతీయ కళాకారులు నిరూపించారని ప్రశంసించారు.
డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలో ప్రారంభం కానున్న ఇండియా బినాలే వేడుకల గురించి ప్రధాని మోదీ దేశ ప్రజలకు వివరించారు. కళలు, వాస్తుశిల్పం, డిజైన్ల మహా ఉత్సవంగా 108 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం దేశంలోని చారిత్రక కట్టడాలు, మ్యూజియంలు, ఆర్ట్ గ్యాలరీలను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని తెలిపారు. పౌరులు తమ ప్రయాణ ప్రణాళికలలో మ్యూజియంలను భాగంగా చేసుకోవాలని, పిల్లలతో కలిసి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ద్వారా మన వారసత్వ సంపదపై అవగాహన పెంచుకుని భారత్‌ను మరింత లోతుగా అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.