స్వదేశీ పరిశోధన, సరసమైన చికిత్సలతో ఆరోగ్య రంగంలో ప్రపంచ శక్తిగా భారత్
సూర్య జాతీయ డెస్క్: స్వదేశీ పరిశోధనలు, వైద్య ఆవిష్కరణలు, సరసమైన ధరల్లో అత్యాధునిక చికిత్సలతో భారత్ ఆరోగ్య రంగంలో గణనీయమైన పరివర్తన సాధిస్తూ ప్రపంచ శక్తిగా ఎదుగుతోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ హెల్త్‌కేర్ కాన్‌క్లేవ్ 2026 కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో పెరుగుతున్న శాస్త్రీయ సామర్థ్యాలు, జన్యు వైవిధ్యం, ప్రెసిషన్ మెడిసిన్ రంగాల్లో వస్తున్న పురోగతిని ఆయన వివరించారు.
వ్యాక్సిన్లు, యాంటీబయోటిక్స్, జీన్ థెరపీ, క్యాన్సర్ చికిత్స రంగాల్లో భారత్ సాధిస్తున్న ప్రగతి సంక్లిష్ట ఆరోగ్య సమస్యలకు స్వదేశీ పరిష్కారాలను రూపొందించే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఒకప్పుడు విదేశీ ఔషధాల తయారీ కేంద్రంగా మాత్రమే పరిమితమైన పరిస్థితి నుంచి మారి, ఇప్పుడు సరికొత్త చికిత్సా విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని తెలిపారు. ఇండియన్ జీనోమ్ ప్రోగ్రామ్, స్వదేశీ యాంటీబయోటిక్స్, హెచ్‌పీవీ టీకా, కార్-టీ సెల్ చికిత్స వంటి అంశాలు అధునాతన వైద్య పరిశోధనల్లో దేశ బలాన్ని చాటుతున్నాయని వెల్లడించారు.
గతంలో ఎక్స్-రే ఆధారిత నిర్ధారణల నుంచి అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక సాంకేతికతల వైపు వైద్య శాస్త్రం పయనించిందని ఆయన గుర్తుచేశారు. ఒకప్పుడు అంటువ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం అంటువ్యాధులతో పాటు టైప్-2 మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, డిస్‌లిపిడెమియా, ఫ్యాటీ లివర్ వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల సవాలును ఎదుర్కొంటున్నామని తెలిపారు. భారత్‌లోని జనాభా, జన్యు వైవిధ్యం వ్యాధుల తీరును అర్థం చేసుకుని పరిశోధనలు చేయడానికి అరుదైన వనరుగా ఉపయోగపడుతోందని వివరించారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా యువ వైద్య విద్యార్థులు కృత్రిమ మేధస్సు, ప్రెసిషన్ మెడిసిన్, నివారణ ఆరోగ్య సంరక్షణ వంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు వల్ల రోగిని ప్రత్యక్షంగా పరీక్షించి అంచనా వేసే వైద్య నైపుణ్యం తగ్గిపోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. క్లినికల్ వైద్యం, సాంకేతికత ఆధారిత చికిత్సల మధ్య సమతుల్యత అవసరమని పేర్కొంటూ, కాన్‌క్లేవ్ అధికారిక సంచికను ఆయన ఆవిష్కరించారు.