ఫోక్స్‌వ్యాగన్ వాదన తప్పుదోవ పట్టించేది
సూర్య జాతీయ డెస్క్: కార్ల విడిభాగాల దిగుమతి విధానాలపై ప్రత్యర్థి ఆటోమొబైల్ సంస్థలతో తనను పోలుస్తూ జర్మనీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ చేసిన వాదనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. 12 ఏళ్ల దిగుమతులకు సంబంధించి 1.2 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయి పన్ను డిమాండ్‌పై సాగుతున్న న్యాయపోరాటంలో పన్ను అధికారులు ఈ మేరకు కీలక సమాధానం సమర్పించారు. పాక్షికమైన, అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఫోక్స్‌వ్యాగన్ వాదనలు చేస్తోందని, ఇతర కంపెనీలతో తప్పుడు పోలికలు తీసుకుంటోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఆడి, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కార్ల విడిభాగాలను వేర్వేరు సరుకులుగా విభజించి దిగుమతి చేసుకుంటూ, 30 నుంచి 35 శాతం వరకు ఉండే పూర్తి కార్ల కిట్ సుంకం నుంచి తప్పించుకునేందుకు 10 శాతం సుంకం మాత్రమే చెల్లించారంటూ 2024లో పన్ను అధికారులు ఆరోపణలు మోపారు. గత 12 ఏళ్లలో విడిభాగాల పేరుతో 5 నుంచి 15 శాతం సుంకం చెల్లించారని, అయితే స్థానిక అసెంబ్లింగ్ కోసం నాక్డ్-డౌన్ కిట్ రూపంలో వచ్చే వాహనాలకు వర్తించే నిబంధనలతో వీటిని పోల్చాల్సి ఉంటుందని పన్ను విభాగం స్పష్టం చేసింది. మెర్సిడెస్-బెంజ్, హ్యుందాయ్ వంటి సంస్థలు నిర్దేశించిన నిబంధనల ప్రకారమే సుంకాలు చెల్లిస్తున్నాయని అధికారులు తమ నివేదికలో ఉదహరించారు.
ఇటీవల ముంబై హైకోర్టులో ఫోక్స్‌వ్యాగన్ వాదనలు వినిపిస్తూ, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, కియా వంటి ఇతర అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు కూడా ఇలాంటి విధానాలనే అనుసరిస్తున్నాయని, తమను మాత్రమే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించింది. దీనిపై స్పందించిన భారత పన్ను అధికారులు, విడిభాగాల దిగుమతులపై ఉన్న నిబంధనలను ఫోక్స్‌వ్యాగన్ వక్రీకరిస్తోందని, తమ విధానాలన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయని తేల్చి చెప్పారు. విలాసవంతమైన మేబ్యాక్ మోడల్‌కు సంబంధించిన అంశం కూడా ఈ వివాదంలో చర్చకు రాగా, తమ వాహనాలతో అది సరిపోలదని ఫోక్స్‌వ్యాగన్ వాదించింది.
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సుమారు 2 శాతం వాటా కలిగి ఉన్న ఫోక్స్‌వ్యాగన్‌కు 1.2 బిలియన్ డాలర్ల పన్ను బకాయి డిమాండ్ ఆర్థికంగాను, నియంత్రణ పరంగాను పెద్ద సవాలుగా మారింది. విడిభాగాల వర్గీకరణ, దిగుమతి సుంకాల నిబంధనల అమలుపై ఇరుపక్షాల మధ్య న్యాయపరమైన వాదోపవాదాలు కొనసాగుతుండటంతో ఈ కేసు దేశీయ, అంతర్జాతీయ వాణిజ్య వర్గాలలో ఆసక్తి రేపుతోంది.