ఉక్రెయిన్ నుంచి స్వీడన్ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఉక్రెయిన్ సాయుధ దళాల నుంచి స్వీడన్‌కు చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థ సాబ్‌కు భారీ రాడార్ కాంట్రాక్ట్ లభించింది. తమ జిరాఫ్ 1ఎక్స్ రాడార్ వ్యవస్థల సరఫరా కోసం ఉక్రెయిన్ నుంచి 450 మిలియన్ యూరోలు అంటే సుమారు 492 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ అందినట్లు శనివారం సాబ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం రాడార్ వ్యవస్థల సరఫరా 2027లో జరగనుందని సంస్థ స్పష్టం చేసింది.
జిరాఫ్ 1ఎక్స్ అనేది అత్యాధునిక మొబైల్ త్రీడీ రాడార్ వ్యవస్థగా గుర్తింపు పొందింది. యుద్ధ రంగంలో విమానాలు, క్షిపణులు, మానవరహిత డ్రోన్ల వంటి గగనతల ముప్పులను వేగంగా గుర్తించి ట్రాక్ చేసేలా దీనిని రూపొందించారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో తన గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఉక్రెయిన్ ఈ కీలక ఒప్పందం చేసుకుంది.
ఉక్రెయిన్‌కు కీలక రక్షణ పరికరాల సరఫరాదారుగా సాబ్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. గత జూన్‌లో కూడా ఉక్రెయిన్‌కు 16 గ్రిపెన్ ఇ యుద్ధ విమానాలను అందించేందుకు సుమారు 24.6 బిలియన్ స్వీడిష్ క్రోనార్లు అంటే దాదాపు 2.40 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంపై సాబ్ సంతకం చేసింది. ఆ యుద్ధ విమానాల సరఫరాను 2029 నుంచి 2030 మధ్య కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్షిపణులు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వ్యవస్థలతో పాటు జలాంతర్గాములను కూడా తయారు చేసే సాబ్ సంస్థకు యూరప్‌లో పెరుగుతున్న రక్షణ వ్యయం భారీగా కలిసి వస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐరోపా దేశాలు ఆయుధ సంపత్తిని వేగంగా పెంచుకుంటుండటంతో సంస్థ కార్యకలాపాలకు ఊపు లభించింది. రక్షణ సామగ్రికి ఉన్న బలమైన డిమాండ్ కారణంగా అక్టోబరులో వెల్లడైన మూడో త్రైమాసికంలో సాబ్ నిర్వహణ లాభం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 1.37 బిలియన్ క్రోనార్ల నుంచి 1.95 బిలియన్ క్రోనార్లకు పెరిగి అంచనాలను మించింది.