డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుక
సూర్య జాతీయ డెస్క్: భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొననున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సాయంత్రం 6 గంటలకు ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అస్సాం మరియు ఈశాన్య భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడి సేవలను స్మరించుకుంటూ, ఏడాది పాటు జరిగిన ఈ వేడుకలకు ఘనంగా ముగింపు పలకనున్నారు.
1926 సెప్టెంబరు 8న అస్సాంలోని సాదియాలో జన్మించిన డాక్టర్ భూపేన్ హజారికా సుధాకంఠ మరియు బ్రహ్మపుత్ర కవిగా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రఖ్యాత గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, గీత రచయితగా, చిత్ర నిర్మాతగా, రచయితగా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్న ఆయన, సామాన్య ప్రజల ఆశలు, భావోద్వేగాలకు తన సృజనాత్మక రచనల ద్వారా గళమిచ్చారు. అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాల జానపద సంప్రదాయాల నుంచి స్ఫూర్తి పొందిన ఆయన సంగీతం భాషా, భౌగోళిక సరిహద్దులను చెరిపివేసి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలను అలరించింది.
కళారంగానికి చేసిన విశేష సేవలతో పాటు, డాక్టర్ హజారికా గొప్ప మానవతావాదిగా, సామాజిక చింతనపరుడిగా సమానత్వం, మానవ గౌరవం, సామాజిక సామరస్యం, విశ్వభ్రాతృత్వ విలువలను తన పాటల ద్వారా ప్రచారం చేశారు. భారతీయ సంగీతం, సినిమా, సంస్కృతికి ఆయన అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక గౌరవాలు వరించాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 2019లో ఆయనకు మరణానంతరం ప్రదానం చేసి కేంద్ర ప్రభుత్వం సముచితంగా గౌరవించింది.
2025 సెప్టెంబరు 8న ప్రారంభమైన డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి ఉత్సవాలు ఆయన సంగీత, సాహిత్య, సినీ, సామాజిక వారసత్వాన్ని నేటి తరానికి మరింత చేరువ చేశాయి. ఈ ముగింపు వేడుకలో భాగంగా ప్రముఖ గాయని ఉషా మంగేష్కర్‌కు ప్రధాని మోదీ చేతుల మీదుగా డాక్టర్ భూపేన్ హజారికా జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. రూ.10 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రంతో కూడిన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రతి మూడేళ్లకోసారి సంగీతం, కళలు, సినీ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందించనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.