కాశీ తమిళ సంగమం 5.0 ప్రారంభం
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఐదో విడత కాశీ తమిళ సంగమం 5.0 ఘనంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ శనివారం ఈ ఉత్సవాన్ని ప్రారంభించి, పది విదేశీ భాషలతో సహా మొత్తం 50 భాషల్లోకి అనువదించిన తిరుక్కురళ్ గ్రంథాలను ఆవిష్కరించారు. వేల ఏళ్లుగా కాశీ మరియు తమిళనాడు మధ్య కొనసాగుతున్న నాగరిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు ఎంతో విశిష్టమైనవని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాశీ నగరం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతోందని, తమిళ ప్రజల హృదయాల్లో కాశీకి, బాబా విశ్వనాథుడి దర్శనానికి ప్రత్యేక స్థానం ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ ఏడాది కాశీ తమిళ సంగమం 5.0 థీమ్‌ను తిరుక్కురళ్ పేలవోం - తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్ అంటే తిరుక్కురళ్‌ను నేర్చుకుందాం అనే ఇతివృత్తంతో రూపొందించారు. మహోన్నత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్‌లోని శాశ్వత జ్ఞానాన్ని, నైతిక విలువలను దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు మరియు యువతకు చేరువ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు. ధర్మం, అర్థం, కామం అనే మూడు విభాగాల్లో 1,330 కురళ్లతో కూడిన ఈ గ్రంథం సమానత్వం, మానవత్వం, సదాచారం వంటి సార్వత్రిక సందేశాలను అందిస్తోందని ఉపరాష్ట్రపతి కొనియాడారు. మొదటి విడతలో 13 భాషల్లో, రెండో విడతలో మరో 16 భాషల్లో వచ్చిన తిరుక్కురళ్ ఇప్పుడు 50 భాషల్లో అందుబాటులోకి రావడం తమిళ సాహిత్య వైభవానికి గొప్ప మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో మొదలైన కాశీ తమిళ సంగమం కేవలం సాంస్కృతిక వేడుకగా కాకుండా, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని బలోపేతం చేసే జాతీయ ఉద్యమంగా ఎదిగిందని సి.పి.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషపై గౌరవం పెంచుకుంటూనే ఇతర భాషలను కూడా గౌరవించాలని, సొంత భాషపై ప్రేమ ఇతర భాషల పట్ల వ్యతిరేకతగా మారకూడదని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ భాషలు, ఉమ్మడి ఆదర్శాలే మన బలమని, ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రధాని మోదీ ప్రస్తావించిన యాదుమ్ ఊరే యావరుమ్ కేళిర్ అంటే విశ్వమే ఒక కుటుంబం అనే తమిళ విశ్వభ్రాతృత్వ భావనను ఆయన గుర్తుచేశారు.
నవంబరు 28 నుంచి డిసెంబరు 12 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు నుంచి 1,400 మందికి పైగా ప్రతినిధులు వారణాసి, ప్రయాగ్‌రాజ్, అయోధ్యలను సందర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు వెయ్యి ఉన్నత విద్యాసంస్థల్లోని విద్యార్థులను తిరుక్కురళ్ అధ్యయనం, పరిశోధన కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. జాతీయ నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా గంగా జలాలు కావేరి వరకు చేరే భవిష్యత్తు రావాలని ఆకాంక్షిస్తూ, డిసెంబరు 12న జరిగే ముగింపు వేడుకకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.