telangana
భూ వివాదం.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
దోమ, మేజర్ న్యూస్: భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన దోమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అన్వర్‌కు వ్యవసాయ భూమి ఉంది. గతంలో తన ఇంటి ముందు ఉన్న కొంత స్థలాన్ని నరేష్ అనే వ్యక్తికి ఇచ్చాడు. అయితే ఇచ్చిన స్థలానికి మించి నరేష్ అదనంగా మరికొంత భూమిని ఆక్రమించాడనే ఆరోపణతో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఘర్షణకు దారితీసి, ఇరువర్గాల వారు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నరేష్, అన్వర్ తీవ్ర రక్తగాయాలతో గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు దోమ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.