మహిళా సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలి
ఆలేరు,మేజర్ న్యూస్:;మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వివిధ స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపునిచ్చారు.శుక్రవారం ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సంఘం (సంఘబంధం) సమావేశం,మహిళా సంఘాల సభ్యుల స్క్రీనింగ్ క్యాంపును జిల్లా కలెక్టర్ సందర్శించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి వారి ఆర్థిక పరిస్థితులు,ఉపాధి అవకాశాలు,ఆరోగ్య పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం,బ్యాంకు రుణాలు,సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు.మహిళలు తమ నైపుణ్యాలు,ఆసక్తులకు అనుగుణంగా టైలరింగ్,కిరాణా దుకాణాలు,కంప్యూటర్ కేంద్రాలు,డ్రోన్ సేవలు,వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు తదితర స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు,అర్హతను బట్టి స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు పొందేలా అవసరమైన మార్గదర్శకత్వం కల్పిస్తామని చెప్పారు.మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా యూనిఫామ్‌ల తయారీ,క్యాంటీన్ల నిర్వహణ వంటి ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకొని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు.అదేవిధంగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.సాంకేతిక కారణాల వల్ల కొందరి వైద్య పరీక్షల నివేదికలు ఆలస్యమైనప్పటికీ,త్వరలోనే సంబంధిత మహిళలందరికీ పూర్తి నివేదికలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,డీపీఎం (ఐబీ) ప్రభాకర్,ఎంఆర్ఓ ఆంజనేయులు,ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్,ఏపీఎం సత్యనారాయణ,గ్రామ సర్పంచ్ మంజుల,మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత,సీసీలు సరస్వతి,రాణెమ్మ,పంచాయతీ కార్యదర్శి,వీవోఏలు,వీవో అధ్యక్షులు,సంబంధిత అధికారులు,మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.