ట్రాఫిక్ జామ్ తట్టుకోలేకపోతున్నాం..
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ : రామ్ కోటి నుంచి షాలిమార్ మార్గంలో సాయంత్రం వేళ ట్రాఫిక్ రద్దీ తట్టుకోలేకపోతున్నామని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ మార్గంలో మెకానిక్ షాపులు, ఆటోమొబైల్ షాపులు ఉండడంతో కస్టమర్లు రోడ్లపై వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో సాయంత్రం వేళ 4 నుంచి 7 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంది. ట్రాఫిక్ అధికారులు ఎవరూ ఈ మార్గంలో లేకపోవడంతో వాహనదారులు,
పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఈ విషయాన్ని గుర్తించి, సూచించిన సమయంలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనదారులకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మార్గంలో వాహనం రిపేరింగ్ లు సైతం ఫుట్పాతులపైనే జరుగుతుండడంతో పాదాచారులు ట్రాఫిక్ లో నడుస్తున్నారు. ఈ రిపేర్ షాపులను సైతం ఇక్కడ నుంచి తొలగించాలని పలువురు ట్రాఫిక్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. క్రిస్టియన్ గ్రేవ్ యార్డు ప్రాంతంలో జంక్షన్ ఉండడంతో ట్రాఫిక్ జామ్ కు మరో కారణంగా తెలుస్తుంది. కనుక ఫుట్పాతులను క్లియర్ చేసి మెకానిక్ షాపులను తొలగిస్తే కొంతవరకు ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని పలువురు సూచించారు.