ఇందిరమ్మ గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
కమలాపూర్, మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూనిపర్తి గ్రామంలో ముదిగొండ ధనలక్ష్మీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగా శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి వెళ్లి ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణం గురించిన వివరాలతో పాటు ఇంకుడు గుంత,మూత్రశాల కట్టుకున్నారా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం చాలా బాగా చేశారని లబ్ధిదారు ధనలక్ష్మీ వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు వచ్చిన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను గుడిసెలో నివసించే వారికి మంజూరు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే వివరాలను అడిగితెలుసుకున్నారు. గ్రామంలో నిర్మిస్తున్న జిపి భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధిక, ఎమ్మార్వో సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్; పవన్ కుమార్ ,కమలాపురం హనుమకొండ జిల్లా