అన్ని దానాల్లోకెల్లా విద్యాదానమే గొప్పది..తండ్రిని కోల్పోయిన విద్యార్థి చదువుకు రూ.25 వేల ఆర్థిక సాయం
విద్యార్థి భవిష్యత్తుకు భరోసాగా శ్రీ వాసవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ సేవలు
నిజాంపేట్ మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే తమ సంకల్పమని, ఒక చిన్న సహాయం కూడా ఓ విద్యార్థి భవిష్యత్తుకు గొప్ప భరోసాగా నిలుస్తుందని శ్రీ వాసవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ప్రతినిధి వెంకటేష్ గుప్తా అన్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో తమ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పదో తరగతి విద్యార్థి దర్శన్ చదువుకు అండగా నిలిచేందుకు శ్రీ వాసవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. విద్యార్థి కుటుంబం సుమారు నాలుగు నెలల క్రితం ట్రస్ట్‌ను సంప్రదించి ఆర్థిక సహాయం కోరగా, వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ట్రస్ట్ ప్రతినిధులు సహాయం అందించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కొంత సమయం తీసుకున్నప్పటికీ, తమ మిత్రులను సంప్రదించి వారి సహకారంతో రూ.25 వేల నగదును సమీకరించారు. ఈ మొత్తాన్ని విద్యార్థి దర్శన్ పాఠశాల ఫీజు అవసరాల కోసం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు, ముఖ్యంగా చదువుకోవాలనే ఆశయం ఉన్న పేద విద్యార్థులకు చేయూత అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మనం చేసే చిన్న సహాయం ఒక విద్యార్థి చదువు కొనసాగించడానికి, తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారు సహాయం కోరినప్పుడు తమకు చేతనైనంత మేరకు స్పందించి అండగా నిలవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సేవా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ వెంకటేష్ గుప్తా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తాము సహాయం కోరిన వెంటనే స్పందిస్తూ, తమకు సాధ్యమైనంత సహకారం అందిస్తున్న మిత్రుల ఔదార్యం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు అండగా నిలుస్తామని శ్రీ వాసవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ తరఫున వెల్లడించారు.