కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గోరంట్ల ఇంటింటి ప్రచారం
కడియం, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడియం మండలంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం కడియపు సావరం గ్రామ పంచాయతీ పరిధిలో అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
జడ్పీటీసీ అభ్యర్థి రత్నం మహేశ్వరి దేవి, ఎంపీపీ అభ్యర్థి బోడపాటి పుణ్యవతి, ఎంపీటీసీ అభ్యర్థి గంధం దుర్గారావుతో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల వాడవాడలా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకమన్నారు. కడియపు సావరం గ్రామంలో ఇప్పటివరకు సుమారు రూ.12 కోట్ల నిధులతో రోడ్లు, డ్రైన్లు, తాగునీటి ట్యాంకులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పూలవర్తక సంఘం కల్యాణ మండపానికి పై అంతస్తు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. వివాదాల్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక కూరగాయల రైతులకు ధవళేశ్వరం రైతుబజారులో విక్రయ అవకాశాలు కల్పించినట్లు వివరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇచ్చే ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.
అనంతరం జేగురుపాడు, మాధవరాయుడుపాలెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు నాగిరెడ్డి మణికుమారి, వందే వెంకటలక్ష్మి, గొల్లపల్లి గంగామణి, పోలినాటి శ్రీనివాసులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కూటమి నాయకులు గట్టి నరసయ్య, ముద్రగడ జమ్మి, గెడ్డం శివరత్న గణపతి, వరగోగుల రుద్రయ్య, చెక్కపల్లి మురళీకృష్ణ, గట్టి సుబ్బారావు, పంతం గణపతి, వరగోగుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.