రైతుబజార్‌లో బాలకార్మికుడి గుర్తింపు
వేతన వ్యత్యాసం చెల్లింపు
శ్రీకాకుళం, అక్టోబర్ 30 మేనేజర్ న్యూస్:
నగరంలోని రైతుబజార్ ప్రాంగణంలో ఉన్న క్రాఫ్ట్ బజార్ దుకాణాల్లో ఈ నెల 16న కార్మిక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక దుకాణంలో 17 ఏళ్ల బాలుడు పనిచేస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. సదరు బాలుడికి రావాల్సిన కనీస వేతన వ్యత్యాస భత్యాన్ని ఇప్పించాలని కోరుతూ శ్రీకాకుళం సహాయ కార్మిక కమిషనర్ ఎదుట కేసు దాఖలు చేశారు.
అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత దుకాణ యజమాని నుంచి రూ.2,000 మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో సదరు కార్మికుడికి ఇప్పించినట్లు సహాయ కార్మిక కమిషనర్ దినేష్ తెలిపారు. వ్యాపార సంస్థలు, దుకాణాల్లో పనిచేసే కార్మికులందరికీ ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనాలను తప్పనిసరిగా చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.