2,23,183 పెన్షన్లకు రూ. 96.93 కోట్ల లబ్ధి - పంపిణీ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, మేజర్ న్యూస్ : ఎన్‌టీఆర్ జిల్లాలో 2,23,183 పెన్షన్లకు మొత్తం రూ. 96.93 కోట్ల లబ్ధి జరుగుతోందని.. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ సజావుగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కంచికచర్ల మండలం, పరిటాల గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పరిశీలించారు. లబ్ధిదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిబ్బంది ద్వారా పంపిణీ కార్యక్రమం సజావుగా జరుగుతుందా.. లేదా? అనేది పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సామాజిక భద్రత లక్ష్యంగా అమలవుతున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు, నిర్లక్ష్యానికి తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించేందుకు సిబ్బందికి దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అనుక్షణం పర్యవేక్షిస్తూ లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో అనిల్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.