పట్టణ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
విజయవాడ మేజర్ న్యూస్ : జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, కొండపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 222 వార్డులకు 1,104 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ మేయర్ స్థానానికి 19 మంది, నందిగామలో ఐదుగురు, జగ్గయ్యపేట, తిరువూరులో ఏడుగురి చొప్పున, కొండపల్లిలో ఎనిమిది మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. వార్డు సభ్యుల స్థానాలకు విజయవాడలో 349 మంది, నందిగామలో 75 మంది, జగ్గయ్యపేటలో 82 మంది, తిరువూరులో 79 మంది, కొండపల్లిలో 106 మంది పోటీ చేస్తున్నారని వివరించారు. ఎన్నికల నిర్వహణకు రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశామని, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటివరకు తీవ్రమైన ఫిర్యాదులు ఏవీ అందలేదని, స్వల్పస్థాయి ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నిబంధనల ప్రకారం వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు అధికారులు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.