telangana
బార్వాద్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్ఎస్‌లోకి ఉపసర్పంచ్ సహా పలువురు యువకులు
కోట్‌పల్లి, మేజర్ న్యూస్: కోట్‌పల్లి మండలం బార్వాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ సహా పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్‌తో పాటు పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఉపసర్పంచ్ శివకుమార్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పరమేష్, జి. మహేష్, టీ. మహేష్, పి. ఆంజనేయులు, బి. రాకేష్, శ్రీశైలం, శ్రీనివాస్, మోహన్, శ్రీకాంత్ తదితరులు డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకుని బీఆర్ఎస్‌లో చేరారు. వారందరికీ ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఆశించిన ప్రయోజనాలు అందడం లేదని గుర్తించి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు చేరుతుంటారని, కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసం, ఆదరణకు ఈ చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్‌ను కోల్పోయామని మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగులుతున్నాయని విమర్శించారు.గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.