ఘట్‌కేసర్ రూరల్, మేజర్ న్యూస్ : బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించి, వారి హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని ఘట్‌కేసర్ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న బాలల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గురువారం బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని అగాపే చిల్డ్రన్ హోమ్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ... చిన్నారులు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు విద్యను అభ్యసిస్తూ ఆరోగ్యంగా ఎదగాలని సూచించారు. వారి భవిష్యత్తుకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, తగిన రక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ నాగేశ్వరరావు మాట్లాడుతూ... బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, వివక్ష, చిన్నారులపై హింస వంటి సమస్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలలు ఎలాంటి వేధింపులకు గురికాకుండా రక్షణ కల్పించడంలో కుటుంబాలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ బాలికల పర్యవేక్షణ అధికారి భవాని మాట్లాడుతూ... చిన్నారుల భద్రత, సంరక్షణ, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బాలబాలికలకు ఆటపాటల ద్వారా ఉత్సాహభరిత వాతావరణంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీం ఎస్‌ఐ రంగారెడ్డి, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ ఖలీల్ అలీ, మెడికల్ ఆఫీసర్ భాగ్యశ్రీ, అగాపే హోమ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, సాధన సంస్థ ప్రతినిధులు, అగాపే హోమ్‌తో పాటు వివిధ ప్రభుత్వ బాలల సంరక్షణ గృహాల సిబ్బంది, బాలబాలికలు పాల్గొన్నారు.