ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు
పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీలో స్వీపింగ్, క్లీనింగ్, గార్డెనింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి దీపావళి పండుగకు ముందే తీపి కబురు అందింది. వారి వేతనాలను దాదాపు 160 శాతం మేర పెంచడంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ సిబ్బంది సూపర్‌వైజర్ నరసింహతో కలిసి ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు ను,అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఉద్యోగి భాగస్వామేనని, పారిశుద్ధ్యం, తోటల నిర్వహణ వంటి పనులు చేస్తున్న సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు వేతనాల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఉద్యోగి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలన్నదే యూనివర్సిటీ ఆకాంక్ష అని పేర్కొన్నారు.దీపావళి పండుగ వేళ తమ జీవితాల్లో వెలుగులు నింపిన యూనివర్సిటీ పాలకవర్గానికి ఔట్సోర్సింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్ నరసింహ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఎం . ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ,మహబూబ్ నగర్ .