విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, సూర్య : నవంబర్ 7 మేజర్ న్యూస్: ఉపాధి కోసం రష్యా వెళ్లి, అక్కడి రష్యా సైన్యంలో చిక్కుకుని రష్యా–ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో ప్రాణభయంతో గడుపుతున్న విశాఖపట్నం చోడవరం ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. శనివారం శ్రీకాకుళంలో బాధిత యువకుల కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ వారిని ఎలాగైనా క్షేమంగా భారతదేశానికి రప్పించి, తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధి కోసం రష్యాలో ఫ్రూట్ ప్యాకింగ్, ఫుడ్ ప్యాకింగ్ వంటి సాధారణ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించడంతో ఐదుగురు యువకులు అక్కడికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రికి వివరించారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత ఉద్యోగాల పేరుతో వారిని రష్యా సైన్యంలోకి తీసుకెళ్లి, రష్యన్ భాషలో ఉన్న ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. తమకు తెలియకుండానే సైనిక కార్యకలాపాల్లో భాగస్వాములను చేసి, రష్యా–ఉక్రెయిన్ సరిహద్దుల్లోని యుద్ధ ప్రాంతాలకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో ముగ్గురిని సుమారు రెండు నెలల క్రితమే ఫ్రంట్‌లైన్‌కు పంపించగా, వారి ఆచూకీపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వివరించారు.
ఇటీవల బాధిత యువకులు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు తమను మరింత కలచివేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని వారు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కుటుంబ సభ్యుల ఆవేదనను విన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధిత యువకుల ఆచూకీ తెలుసుకోవడంతో పాటు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యల కోసం తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారికి అండగా ఉంటానని తెలిపారు.