ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలల దినోత్సవం కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'పై ప్రశంసల జల్లు కురుస్తోంది. నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్‌ను డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల అధినేత అలాగే ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఘనంగా విడుదల చేశారు.
డీపీఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్క కొమరయ్య సినిమా విశేషాలను కొనియాడారు. పిల్లల మనస్తత్వం, చదువుపై ఉండే ఒత్తిడి, ముఖ్యంగా గణితం వంటి సబ్జెక్టుల పట్ల విద్యార్థుల్లో ఉండే భయాలను అధిగమించే అద్భుతమైన సందేశంతో ఈ సినిమా రూపుదిద్దుకుందని ఆయన పేర్కొన్నారు. కేవలం మార్కులే పిల్లల ప్రతిభకు కొలమానం కాదని, ప్రతి చిన్నారిలోని ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులందరూ ఈ చిత్రాన్ని వీక్షించేలా తన విద్యాసంస్థల తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు నవీన్ దేశబోయిన, హీరో ఆశిష్ గాంధీ, బాలనటులు మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహాతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ సరిత మేడమ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులతో చిత్ర బృందం నిర్వహించిన సరదా సంభాషణలు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదే వేదికపై బాలనటి ఊహా పుట్టినరోజు వేడుకలను విద్యార్థులు మరియు చిత్ర యూనిట్ సమక్షంలో అత్యంత ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
పిల్లల ఆలోచనలను ప్రతిబింబించేలా, విద్యాపరమైన ఒత్తిళ్లను అధిగమించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వినోదంతో పాటు చక్కటి సందేశాన్ని అందించే ఈ విభిన్నమైన చిత్రాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలో కుటుంబ సమేతంగా చూసి విజయవంతం చేయాలని చిత్ర బృందం కోరుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలతో రోజురోజుకూ హైప్ సంతరించుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.