ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధే మా సర్కార్ ధ్యేయం : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
— రూ. 2.40 కోట్లతో నిర్మించిన గురజాల బీటీ రోడ్డు ప్రారంభం
— మాట నిలబెట్టుకున్నాం.. 14 నెలల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం.
— రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు.
— రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి
కృష్ణ సూర్య న్యూస్ :
గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. శనివారం మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణ మండలంలోని, గురజాల గ్రామంలో కృష్ణ బ్రిడ్జి నుండి గురజాల వరకు సుమారు రూ. 2.40 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. అంతకుముందు టైరోడ్డ చౌరస్తా నుంచి హిందూపూర్ మీదుగా కృష్ణ కు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులతో గుర్జాల్ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. గతంలో గురజాల గ్రామానికి రోడ్డు పూర్తయ్యాకే అడుగుపెడతానని హామీ ఇచ్చానని, ఆ మాట ప్రకారం కేవలం 14 నెలల్లోనే రహదారి పనులన్నీ పూర్తి చేయించి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి గుర్తుచేశారు. మక్తల్ నియోజకవర్గం చిన్న ప్రాంతమైనప్పటికీ రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు రూ. 35 కోట్ల నుండి రూ. 40 కోట్ల వరకు నిధులు కేటాయించి పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని మంత్రి ఆకాంక్షించారు.
కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ అనే తేడా లేకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసమే పని చేస్తుందని ప్రతి అర్హులైన ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహనీయుల విగ్రహాల ఆవిష్కరణలు, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మహనీయుల ఆశయాలను గౌరవిస్తూ,వ్యక్తిగత విభేదాలు పక్కనబెట్టి గ్రామాల ప్రగతికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కమలమ్మ, తనయుడు రవి పాటీల్, సంతోష్ పాటిల్ మంత్రి కి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. శాలువా ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమలమ్మ,ప్రజాప్రతినిధుల, స్థానిక నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు,ఉప సర్పంచ్ లు,సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, నాయకులు , కార్యకర్తలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సిములు, సూర్య రిపోర్టర్ కృష్ణ మండలం